Sunday, 20 May 2012

హార్డ్ డిస్క్ పై నాలుగో భాగం - పార్టిషన్లతో పని చేయడం



మొదటి మూడు భాగాలలో, హార్డ్ డిస్క్ గురించిన ముఖ్యమైన ప్రాధమిక సమాచారం తెలుసుకున్నాం. ఫైల్ సిస్టం లు అంటే ఇప్పుడు మనకో మంచి అవగాహన ఉంది. ఈ పాఠ్యాంశంలో కాస్త తనువూ, మనసూ శ్రద్ధతో నిమగ్నం చేసి (అంటే మన వాడుకలో, ఒళ్ళు దగ్గరపెట్టుకుని :) ) చేయాల్సిన విషయాలు చూద్దాం - అవే, పార్టిషన్లు సృష్టించడం, సైజు మార్చడం, తొలగించడం.
ముందుగా మీరు ఒక విషయం తప్పకుండ గమనించాలి! మీరు ఏ చిన్న తప్పు చేసినా మీ హార్డ్ డిస్క్ మీదున్న డేటా కి చాలా పెద్ద ప్రమాదమే వస్తుంది! కాబట్టి, మీకు ముఖ్యమైన ఫైళ్లు గట్టా ఉంటే ముందు అవి వేరే కంప్యూటర్ కో ఒక సిడి లోకో కాపీ చేస్కొండి.


విండోస్ వాడేవారికి సూచనలు క్రింద ఇక్కడ ఉన్నాయి.


లినక్సు లో పార్టిషన్ల అంతు పట్టడానికి అత్యంత బ్రహ్మాండమైన ఉపకరణం ఉంది - జీ-పార్టెడ్(gparted) అని. దాని వివరం ఇది - Gnome Partition Editor (గ్నోమ్ లో పార్టిషన్ లు చక్కబెట్టే ఉపకరణం అని దానర్థం). ప్రస్తుతం ఉన్న అన్ని ఉపకరణాల్లోకి అత్యంత సురక్షితమైంది, నమ్మదగింది ఇదేనని కూడా నా ఉద్దేశ్యం. సాధారణంగా లినక్సు లో మెయిన్ మెనూ లో System లో Administration లో GParted అని ఉంటుంది. ఒకవేళ లేకపొతే ఆల్ట్-f2 కొట్టి gparted టైపు chesi రన్ చేయండి. ఒకవేళ కమాండ్ లేదని వస్తే బహుశా అది మీ సిస్టం లో ఇంకా ఇన్స్టాల్ అయ్యి ఉండదు. ఈ క్రింది కమాండ్ తో ఇన్స్టాల్ చేస్కొండి.

ఉబుంటు వారు:
sudo apt-get install gparted
ఫెడోరా వారు:
su -c'yum -y install gparted'


ఇప్పుడు పైన చెప్పిన విధానం ప్రకారం ఆ ఉపకరణాన్ని తెరవండి. ఒక విండో వస్తుంది, ఇలా..




మీకు ఒకటి కంటే ఎక్కువ హార్డ్ డిస్క్ లు ఉండి ఉంటే, కుడి వైపు, పైన డిస్క్ ఐకాన్ ఉంటుంది, మెనూ బటన్ లో. అది నొక్కితే మిగతా డిస్క్ లు కూడా చూపిస్తుంది. మీరు ఎంచుకున్న డిస్క్ లో ఉన్న పార్టిషన్ లు అన్ని క్రిందబాగంలో చూపిస్తుంది. 

౧. కొత్త పార్టిషన్ సృష్టించడం

మీ హార్డ్ డిస్క్ లో ఖాళీ జాగా ఉంటే దాన్ని unallocated గా చూపిస్తుంది. అంటే దాన్నుంచి మనం కొత్త పార్టిషన్ సృష్టించడానికి వీలుందన్న మాట! దాని మీద రైట్ క్లిక్ chesi, New ఎంచుకోండి. ఒక విండో తెరుచుకుంటుంది, ఇలా..

ఇందులో, మీకు కావాల్సిన ఫైల్ సిస్టం ఎంచుకోండి. అలాగే ఈ పార్టిషన్ ఎంత జాగాలో ఉండాలో కూడా చెప్పండి. అన్నే సరిగ్గానే ఇచ్చారు అని అనుకున్నాక, Ok కొట్టండి. కొట్టి పైన విండో లో టిక్ మార్క్ ఉంటుంది, అది కొడితే మీకు కావాల్సిన కొత్త పార్టిషన్ వచ్చేస్తుంది!

౨. ఉన్న పార్టిషన్ ని తక్కువ జగాకి కుదించడం, లేదా ఎక్కువ జాగాకి పెంచడం.

మీకు కావాల్సిన పార్టిషన్ ని ఎంచుకుని, రైట్ క్లిక్ chesi, Resize ఎంచుకోండి. ఒక విండో తెరుచుకుంటుంది, ఇలా..


 ఇందులో, ఆ పెద్ద బద్దెలా కనిపించే దానిలో చివర పట్టుకుని మీకు కావలసినంత ఖాళీ ఆ పార్టిషన్ బయటికి/లోపలికి వచ్చేదాకా లాగండి. క్రింద నెంబర్ లు ఇచ్చిన ఒకటే. మీరు కావాల్సిన సవరింపు సరిగ్గా నిర్దేశించాక Resize/Move కొట్టేయండి. ఆ తర్వాత పైనున్న టిక్ మార్క్ కొడితే, మీ పార్టిషన్ రీసైజ్ అయిపోతుంది. సాధారణంగా పార్టిషన్ పరిమాణాన్ని బట్టి ఈ తంతు కి కాస్త బాగానే టైం పడుతుంది.

 

౩. ఉన్న పార్టిషన్ పూర్తిగా తొలగించడం

మీరు తీసేయ్యాలనుకున్న పార్టిషన్ మీద రైట్ క్లిక్ కొట్టి, Delete ఆప్షన్ ని ఎంచుకోండి. జాగ్రత్త సుమా! ఒకటికి రెండు మార్లు అలోచించి చేయండి ఈ పని! ఒకవేళ పొరపాటున Delete ఎంచుకున్నట్టైతే, టిక్ కొట్టక ముందు, దానికి ఎడమవైపునున్న వంగిన బాణం గుర్తు పై కొడితే మీరు చేసినా చివరి చర్య వెనక్కి తీస్కుంటుంది. ఇది టిక్ పెట్టక ముందు అయితేనే!! ఒకవేళ డిలీట్ చెయ్యాలి అని మీరు నిర్ణయించుకున్నట్టైతే  టిక్ మార్క్ పై క్లిక్ చేయండి.

ఇవే కాక, ఇందులోనే, ఆ పార్టిషన్‌లో ఏమన్నా సమస్యలున్నాయేమో చూడొచ్చు. సమస్యలున్నాయనుకున్న పార్టిషన్‌ మీద రైట్‌క్లిక్ కొట్టి, అందులో Check అనే ఆప్షన్‌ ఎంచుకోండి, ఈ బొమ్మలో చూపినట్టు. తర్వాత టిక్‌మార్క్ కొట్టేస్తే చెక్ చేసేసి ఏమన్నా ఉంటే సరిచేస్తుంది, సరిచేయనివి ఉంటే చూపిస్తుంది. 



ఇంకా, ఒకవేళ ఉన్న పార్టిషన్‌ ని వేరే ఫైల్ సిస్టంకి మార్చడం కూడా కుదురుతుంది. కాని, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పార్టిషన్‌ మీదున్న డేటా అంతా తుడిచిపెట్టుకుపోతుంది! కాబట్టి జాగ్రత్త. ఆ పార్టిషన్‌ని తోలగించి మళ్ళీ సృష్టించినట్టే! ఒకవేళ మీరు నిర్ణయించుకునే ఉంటే, చేయడానికి, పార్టిషన్‌ ఎంచుకుని, రైట్‌క్లిక్‌ చేసి, Format to మీదకి వెళ్ళండి. అందులోనుండి మీకు కావల్సిన ఫైల్‌ సిస్టం ఎంచుకోండి. తర్వాత పైనున్న టిక్‌ మార్క్ కొట్టడం మర్చిపోవద్దు. 




My Computer మీద రైట్ క్లిక్ కొట్టి, Manage ఎంచుకోండి. ఒక విండో వస్తుంది, ఇలా...
ఆ వచ్చిన విండో లో Disk Management ఎంచుకోండి. ఇక్కడ కూడా ఖాళీ జాగా ఉంటే "unallocated" అని చూపిస్తుంది.

౧. కొత్త పార్టిషన్ సృష్టించాలంటే

unallocated అని ఉన్న బద్దె మీద రైట్ క్లిక్ కొట్టి, New ఎంచుకోండి. అక్కడ మీరిచ్చే సైజు ని బట్టి, NTFS, FAT లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇస్తుంది. సైజు మరీ పడ్డది ఐతే FAT ఆప్షన్ దాచేస్తుంది :) కిందున్న Perform a quick format ని ఎంచుకుంటే, పార్టిషన్ త్వరగా సృష్టించబడుతుంది. Compress this drive ని ఎంచుకుంటే, కాసిన్ని ఎక్కువ ఫైళ్లు పెట్టుకోవచ్చు, ఉన్న ఫైళ్ళను బాగా కుదేసి బద్రపరుచుతుంది కాబట్టి. మీరు సృష్టించిన కొత్త పార్టిషన్ ని My Computer కి వెళ్లి చుస్కోవచ్చు.

౨. ఉన్న పార్టిషన్ ని తొలగించాలి అంటే

అక్కడ మీరు తీసేయ్యాలి అనుకున్న పార్టిషన్ ని రైట్ క్లిక్ కొట్టి Delete Partition ఆప్షన్ ని ఎంచుకోండి. డిలీట్ చేసేయవచ్చా అని అడుగుతుంది. ఆలోచించండి, మళ్ళీ మళ్ళీ అలోచించి, అప్పటికీ అవుననే అనుకుంటే, డిలీట్ చేసేయ్ మనండి.

ఇందులో, రీసైజ్ చేయడానికి సదుపాయం లేదు. వేరే సాఫ్ట్వేర్ లు ఉన్నాయ్ కానీ, వాటితో చాలా జాగ్రత్త అవసరం, అసలు వాటిని ఉపయోగించే ముందు, ఇంకా తప్పదు అనే పరిస్థితి వస్తే తప్ప వాడవద్దని నా సలహా. అన్నీ తెలిసినవారు వదిన, కొన్ని సార్లు డేటా కోల్పోవడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ౧౦౦% ఎప్పుడూ సరిగ్గానే పనిచేయాలని లేదు కదా, అందులో ఏం తప్పుండి అది ఎప్పుడు పొడచూపుతుందో!

వచ్చే భాగంలో పొరపాటున మనకు అత్యంత ముఖ్యమైన ఫైళ్ళు డిలీట్ చేసేస్తే వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం ఎలాగో చూద్దాం. 

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger