పని చేస్తున్నప్పుడు, మనం మౌస్ ఎక్కువ ఉపయోగించక్కర్లేకుండా కీ బోర్డు తో అన్నీ చక్కబెట్టుకునేల ఉంటే ఆహా, ఆ స్వర్గమే వేరు. అందులోను, నాలుగైదు కీలు పటపట నొక్కక్కర్లేకుండా తక్కువ కీ లతో పనికి అంతరాయం లేకుండా అయిపోయేలా ఉంటే, అది అక్షరాల స్వర్గసౌఖ్యమే! లినక్సు టెర్మినల్ వాడే పద్దతుల్లో ఒకటైన అచ్చం అలాంటి ఒక ఉపకరణం గురించి తెలుసుకుందాం.
లినక్సు వాడేవారిలో ఎక్కువమంది టెర్మినల్ ముట్టుకోకుండా ఉండరు. అసలు ఆ టెర్మినల్ యే వాడకపోతే నాలాంటి వాళ్ళ దృష్టిలో లినక్సు వాడుతున్న పస కోల్పోయినట్టే :) ధనాధన టెర్మినల్ విండో లు మార్చుకుంటూ, కాపీ పేస్టు లకి షార్ట్ కట్ లు వాడుకుంటూ, మాటిమాటికి ఆల్ట్-ట్యాబు కొట్టక్కర్లేని విధంగా అనువుగా టెర్మినల్ ని వాడే విధానం ఎంత ముద్దుగా ఉంటుందో! అసలు ఇలాంటి ఐడియా మనవాళ్ళకి ఒక ఆట నుండి పుట్టింది. క్వేక్ అని ఒక ఆట ఉండి, అందులో ఒక కీ నొక్కితే పైనుంచి యానిమేషన్ తో ఒక విండో దిగుతుంది. అచ్చంగా అలాగే ఒక టెర్మినల్ ఎములేటర్ ని తయారు చేసారు - యాకువేక్ అని. కానీ అది కే.డి.యి కి అనువుగా ఉంటుంది. గ్నోమ్ లో అచ్చం అలాంటిదే ఒక వచ్చింది, గ్నోమ్ కి అనువుగా - గువేక్ అని. దీన్ని ఇన్స్టాల్ చేస్కోవడం చాలా తేలిక.
sudo apt-get install guake
అని కొడితే చక చక ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆల్ట్-f2 కొట్టి, guake అని టైపు చేసి రన్ చేస్తే రన్ అవుతుంది. దాన్ని చూడాలంటే f12 కొట్టాలి. దాచెయ్యాలంటే మళ్ళీ f12 యే కొట్టాలి. దాని విండో మీద రైట్ క్లిక్ కొట్టి, preferences ఎంచుకుని, మీకు కావాల్సిన రంగు, పారదర్శకత, సైజు, షార్ట్ కట్ లు లాంటివి సెట్ చేస్కోవచ్చు. ఇలాంటిదే టిల్డే అని ఇంకోటుంది. అది కూడా ప్రయత్నించాను కాని, ఎన్నో విషయాల్లో గువేక్ దే పై చేయి అనిపించింది. కొన్ని తెరపట్లు ఇవిగోండి.
గువేక్ తెర మొత్తం లో..
గువేక్ సవరింపులు
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
No comments:
Post a Comment