gg
ఈ చిన్న కథ మీరు రోజు వాడుతున్న ఇంటర్నెట్ ఎలా పని చేస్తుందో చెప్తుంది.
అనగనగ ఒక ఊరిలో ఒక విచిత్రమైన తోట ఉండేది. ఆ తోటకి పని వాళ్ళేగాని యజమాని లేడు. ఆ ఊరి జనానికి తినడానికి ఏం కావాల్సిన ఆ తోట దగ్గరికే వెళ్ళేవారు. ఆ తోట లోపలికి ఎవ్వరికీ ప్రవేశం లేదు. జనానికి పని వాళ్ళు తెలియరు, పనివాళ్ళకి జనాలు తెలియరు. మీకు ఆకలి వేసిందే అనుకోండి, మీరు వెళ్లి ఆ తోట కి ఉండే కంచెకి వేళ్ళాడే వెయ్యిన్నొక్క బుట్టల్లో ఒక బుట్ట దగ్గరికి వెళ్లి మీకేం కావాలో చీటీ రాసి అందులో వేస్తారు. అలా వేయగానే ఆ బుట్ట చీటీతో లోపలికి వెళ్లి, మీకు కావాల్సిన వాటితో బయటికి వస్తుంది. ఆ వచ్చింది తీసుకుని తిని వచ్చిన దారిని ఇంటికి పోవడమే.
అబ్బా! భలే ఉంది కదూ ఆ ఊరేదో! దానికేనండి మనం ముద్దుగా ఇంటర్నెట్ అని పేరెట్టుకున్నాం :). ఇప్పుడు ఆ కథలో ఏయే పాత్రల్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం.
1.(౧). తోట - ఇంటర్నెట్
2.(౨). బుట్టలు - బ్రౌజరు/విహారిణి
3.(౩). పనివాళ్ళు - వెబ్ సర్వర్లు
4.(౪). జనాలు - బ్రౌజరు వాడుతూ ఇంటర్నెట్ ఉపయోగించుకునే వాళ్ళు, అంటే క్లైంట్లు.
5.(౫). బుట్టలో తిరిగి వచ్చేవి - వెబ్ పేజిలు, వెబ్ సర్వీసులు.
6.(౬). కంచె - రక్షణ కవచం, అంటే, ఫైర్ వాల్ లాంటిది అనుకోవచ్చు(కానీ ఫైర్ వాల్ యే కానక్కర్లేదు).
7(౭). చీటిలో రాసేవి - వెబ్ అడ్రస్/శోధన పదాలు
ఈ మాత్రం తెలిస్తే చెలరేగిపోవచ్చు. ఈ ప్రాధమిక సమాచారం బాగా వంట పట్టించుకుంటే, మీకు ఆసక్తి ఉన్న విషయం తీస్కుని ఒక ఆట ఆడుకోవచ్చు. ఉదాహరణకి, ఈ మొత్తం వ్యవస్థలో రకరకాల సవాళ్లు ఉంటాయి. వెబ్ సర్వర్ విషయానికి వస్తే, వాటిల్లో ఉండే సర్వీసులు నిర్మించడం దగ్గర్నుంచి, వాటికి కంచె వేయడం వరకు ఒక చదరంగమే! ఇక క్లైంట్ వైపు (అంటే ఆ పేజిలని, సర్వీసులని వాడే జనాలకి, ప్రోగ్రాంలకి చివరికి అందుబాటులో ఉండే సమాచారం) ఇక్కడ కూడా, కావాల్సిన ప్రోగ్రాం లను నిర్మించడం దగ్గర్నుంచి, ఆ పేజి డిజైన్, లే అవుట్, లోడింగ్ టైం చూసుకోవడం వరకు ఇది కూడా చాలా పెద్ద వ్యవస్థే! వచ్చే పాఠ్యాంశాల్లో సర్వర్, క్లైంట్ ఆర్కిటెక్చర్ గురించి, ఆ రెంటికి వాడే వివిధ రకాల టెక్నాలజీల గురించి తెలుసుకుందాం.